Monday 12 May 2014

నృసింహ జయంతి


నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను.

"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"


అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణము లో కలదు.శ్రీవైష్ణవులు సంప్రదాయానుసారంగఅ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.




Friday 9 May 2014

సత్యనారాయణ వ్రత విధానం

సత్యనారాయణ వ్రత విధానం: ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )

శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )

ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.

ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )

పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.

Thursday 8 May 2014



కాలజ్ఞాన రూపకర్త శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి ఆరాధనా

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు వినగానే మనకు జ్ఞాపకమొచ్చేది కాలజ్ఞానం. భవిష్యత్తును పాట రూపంలో చెప్పిన ఈయనకు కాలజ్ఞానంపై సినిమాలు కూడా రూపొందిచారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి చెందినవారు. పశువుల కాపరిగానే ఉంటూ తన మహత్తర కంఠస్వరంతో తత్వాన్ని జనానికి భోధించిన యోగి.

ఈయన సమాజంలోని కుల జాఢ్యాన్ని రూపుమాపడానికి కృషి చేశారు. ఈయనకు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు సిద్దయ్య దూదేకుల కులానికి చెందిన వాడు. మరొక భక్తుడు కక్కయ్య ఇంకొక కులానికి చెందినవాడు ఇలా వివిధ కులాలకు చెందిన వారిని దరిన చేర్చుకుని తన తత్వాన్ని జనంలోకి ప్రచారం చేశారు. 





కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండంలోని ఆయన పేరిట పెద్ద మఠం ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆయన పేరిటే ఆ మండలం ఏర్పడింది. సంఘసంస్కర్త అయిన ఆయన తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని చాలా మంది నమ్మకం.

కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యారు. వీరబ్రహ్మంగారి వలనే కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడకు వెళ్ళడానికి మైదుకూరను నుంచి బస్సుసౌకర్యం ఉంది. 

అందరూ కలిసిమెలిసి జీవించండి. ఆనందంగా ముందుకుసాగండి అన్నారు స్వామి. ఆయన ఆధాత్మిక జీవనవిధానం చక్కగా దోహదం చేస్తుంది. అది వ్యక్తిస్వర్ధాన్ని పక్కకుపెట్టి త్యాగాన్ని వృద్దిచేస్తుంది. తద్వారా పరహితం కోరగలరు. స్వహితం కొంత పక్కన పెట్టగలరు. సాధనతో ముందుకుసాగితే ఇంకా వివేకవంతులై నవ్య సమాజానికి బాటలు వేయగలరని ఉద్బోధించారు స్వామి. కనుక స్వామిచెప్పిన మార్గాన్ని అవలంబించి సమాజహితులమై శ్రేయో మార్గాన్ని అవలంబిస్తు; కావున అందరూ వైశాఖశుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన జరుపుకొనవలెను. వీలయినవారు బ్రహ్మంగారి మఠం (కందిమల్లయ్యపల్లి) దర్శించగలరు. అంతేగాక ఆర్థిక స్తోమత లేనివారు తమ తమ గృహములలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అష్టోత్తరపూజ చేసి నివేదన జేయగలరు. బ్రహ్మంగారి కళ్యాణము (కందిమల్లయ్యపల్లి) బ్రహ్మంగారి మఠము నండు మహాశివరాత్రిపర్వదినమున అత్యంత వైభవోపేతంగా జరుగును. కావున తప్పక దర్శించగలరు.

Sunday 27 April 2014

పెద్దబాలశిక్ష గ్రంథంలాంటిది

సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసంలో ‘పెద్దబాలశిక్ష’ ఆది గ్రంథంలాంటిది. మహాభారతంలాగానే పెద్దబాలశిక్షను కూడా పద్దెనిమిది పర్వాలుగా విభజించారు. అందుకే దీనిని ‘బాలల విజ్ఞానసర్వస్వం’గా భావిస్తారు. పూర్వం ఆంధ్రదేశంలోని ప్రతి విద్యార్థి పెద్దబాలశిక్షతోనే చదువు ప్రారంభించేవారు. ఐదవ తరగతి పూర్తయ్యేసరికి పెద్దబాలశిక్ష కంఠపాఠమవ్వాలి. ఆంగ్లేయుల కాలంలో ఆంధ్రదేశంలోని అన్ని పాఠశాలల్లోను పెద్దబాలశిక్ష పాఠ్యాంశంగా ఉండేది.

నేపథ్యం...
ఆంగ్లేయుల దగ్గర రెవెన్యూ శాఖలో పనిచేస్తూన్న స్థానికుల కోసం, 1832లో ‘మేస్తర్ క్లూలో’ అనే తెల్లదొర ‘పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి’ అనే పండితుడి చేత ‘బాలశిక్ష’గ్రంథాన్ని రచింపచేశాడు. పిల్లలకు తేలికగా అర్థమవ్వాలనే లక్ష్యంతో ఈ పుస్తక రూపకల్పన జరిగింది. ఇది 1856 నాటికి 78 పుటలతో పుస్తక రూపంగా వెలువడింది. ఇటువంటి పుస్తకం కోసం ఎదురుచూస్తున్న తెలుగువారు దీనిని మనసారా అక్కున చేర్చుకున్నారు.

1865లో వెలువడిన 90 పుటల బాలశిక్షలో, పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలు, ఛందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను చేర్చి, ‘‘బాలవివేక కల్పతరువు’’ గా రూపొందించారు. అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలో ఉన్న పుస్తకం పెద్దబాలశిక్షగా కొత్తపేరును సంతరించుకుంది. ఇందులో భాష, సంస్కృతులకు కావలసిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సరళమైన పదాలు, రెండుమూడు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు, నీతి వాక్యాలు, ప్రాసవాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ అందరూ తెలుసుకోదగ్గవీ, అప్పటివరకు తెలిసి ఉన్న చారిత్రక భౌగోళిక విజ్ఞాన సంబంధ విషయాలు... వీటన్నిటినీ ఈ పుస్తకం లో పుదూరువారు పొందుపరిచారు.

పుదూరి వారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916 లో వచ్చిన వావిళ్ల వారిది. భాషోద్ధారకులు వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో... ‘‘భారతదేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి, ఇట్టి (బాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను’’ అని చెప్పారు.

కొన్ని మార్పులు, చేర్పులతో ఎందరో ప్రచురణకర్తలు, ఎన్నో పండిత పరిష్కరణలతో నేటికీ వెలువడుతూనే ఉంది. పిల్లలకే కాకుండా పెద్దలకు సైతం తెలుగుదనాన్ని నేర్పి, చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం పెద్దబాలశిక్షకు ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది. పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్దబాలశిక్షను ‘గుణశీల పేటిక’ గా అభివర్ణించారు. నాటి నుంచి నేటివరకు పెద్ద బాలశిక్షను తెలుగువారంతా తమ మానసపుత్రికగా కాపాడుకుంటూనే ఉన్నారు. ఇంటింటా ఈ పుస్తకం ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నారు. తెలుగు సంవత్సరాలు, నక్షత్రాలు, రాశులు, చుట్టరికాలు, తిథులు, మాసాలు, ఋతువులు, వారాలు, అధిపతులు, సప్తద్వీపాలు, దశావతారాలు...వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలకు పైనే పెద్దబాలశిక్షలు లభిస్తున్నాయి. బుడ్డిగ సుబ్బరాయన్ రూపొదించిన ‘సురభి’ గాజుల సత్యనారాయణ ‘తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష’ విరివిగా లభిస్తున్నాయి. ఈనాటికీ ‘పెద్దబాలశిక్ష’ పేరుకు ఎంతో గౌరవం, ఆదరణ ఉన్నాయి. ‘పెద్దబాలశిక్ష’ వంటి పుస్తకం తెలుగువారి సొంతం. ఇది తెలుగుభాష గొప్పదనం, తెలుగుజాతి నిండుదనం, తెలుగువారి అదృష్టంగా భావించాలి. ప్రస్తుత ఈ పుస్తకం మూడు సంవత్సరాలలోపే 36 సార్లు ముద్రణ పొంది, రెండున్నర లక్షల ప్రతులు చెల్లాయి. పెద్దబాలశిక్ష పేరు చిరస్థాయిగా నిలిచితీరుతుంది.

Saturday 26 April 2014

భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం --- కరిఁ దిగుచు మకరి సరసికి

కరిఁ దిగుచు మకరి సరసికి
గారి దరికిని మకరిఁ దిగుచుఁ గరకరి బెరయన్
గారికి మకరి మకరికిఁ గరి
భరి మనుచును నతలకుతల భటు లరుదు పడన్ .




పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం లో రచించిన పద్యం ఇది. ఏనుగు నీరు త్రాగడానికి నదిలో దిగినప్పుడు ముసలి ఎనుగుపాదం తన నోటితో గట్టిగా పట్టుకుంది.

భావం :- ఒకరిపై ఒకరికి పగ పెరిగే విధముగా ముసలి, ఏనుగు ఆ నదిలో పోరాడుచున్నవి. ముసలి, ఏనుగును నదిలో లాగుచున్నది. ఏనుగు ముసలిని నెల పైకి ఈడ్చుచున్నది. ఒకదానికి ఒకటి భయపడకుండా పోరాడుచిన్నవి. 

రామాయణలో కథ కైక పాత్రకున్న ప్రాధాన్యం

రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది.


అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.  రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది

కైకెయి సీత గౌగిటికి గైకొని, “ఓసి యనుంగ! నీవుగా
గైకొని యీ వనీచయ నికామ నివాసభరంబిదెల్లనున్
లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే
గాక దశాననాది వధ కల్గునె యన్న ప్రశంస లోనికిన్”


“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని, “ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”. అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ. దానికి కైక వరాలే కదా కీలకం! విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే కల్పవృక్షం చివరలో, “కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు. అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం.